ఎమ్మెల్యే ఫొటోలు తీయలేదని వీఆర్వోకు మెమో

తాను చెప్పిన పని చేయలేదని రెవెన్యూ సిబ్బందికి మండల పరిషత్‌ అధికారి మోమో ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ మిడసల జ్వాలా నరసింహానికి మద్దిపాడు మండల వీఆర్వోలు సోమవారం వినతి పత్రం అందించారు. అందులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి..

వెల్లంపల్లిలో ఇటీవల చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి చిత్రాలు తీయాలని ఆ గ్రామ వీఆర్వో అరుణకి ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో తన సహాయకులతో ఆమె ఫొటోలు తీయించారు.

ఇందుకు గాను ఎంపీడీవో ఆమెను కార్యాలయానికి పిలిపించి తాను చెప్పిన పని చేయలేదంటూ సచివాలయం కార్యదర్శితో మెమో ఇప్పించారు. రిజిస్టర్‌లో ఈ నెల అయిదో తేదీ నుంచి నెలంతా సెలవు దినాలుగా వేసి.. బయోమెట్రిక్‌ కూడా వేయించొద్దని ఆయా శాఖల సిబ్బందికి సూచించారు. దీనిపై స్పందించి వీఆర్వోకు న్యాయం చేయాలని కోరారు.

ఈ విషయమై ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తనకు రెండు మండలాల బాధ్యతలు అప్పగించారని, పని ఒత్తిడి ఎక్కువైందన్నారు. ఎవరెవరో వచ్చి చికాకు తెప్పించే సయమంలో కోపం చూపానే కానీ ఎవరికీ నష్టం చేయాలనేది తన ఉద్దేశం కాదన్నారు.