పరుగు పందెం గెలిచిన పాపానికి ఎడ్లకు విషమిచ్చారు..!

-

పరుగుపందెంలో గెలిచిన పాపానికి నాలుగు ఎడ్లకు విషమిచ్చిన ఘటన సామర్లకోటలో చోటు చేసుకుంది. రైతు సత్యేంద్ర కుమార్‌ పందెలలో పాల్గొనేందుకు ఎడ్లను పెంచుతున్నారు. 20 ఏళ్లుగా ఆ రైతు ఎడ్లే ఎక్కుసార్లు గెలుపొంది ఎన్నో పతకాలు సాధించాయి. రాజానగరంలో జనవరి రెండో వారంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెంలో మళ్లీ మొదటిస్థానంలో నిలిచాయి. తాజాగా శుక్రవారం కృష్ణాజిల్లా కైకలూరులో జరిగిన పందెంలోనూ ప్రథమ స్థానం దక్కించుకున్నాయి.

గెలిచిన కొన్ని గంటల్లోనే..

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు సామర్లకోటకు సత్యేంద్రకుమార్‌ ఎడ్లను మకాంలో పెట్టి అర్ధరాత్రికి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి నాలుగు ఎడ్ల నోటి నుంచి నురగ వచ్చి మృతి చెంది పడి ఉన్నాయి. కానీ.. అక్కడున్న మరికొన్ని పశువులకు ఏమీ కాలేదు. పరుగు పందెం కోసం ఇటీవల ఓ ఎద్దును రూ. రూ.5 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని సత్యేంద్రకుమార్‌ వాపోయారు.

రూ. 35 లక్షలు..

వరుసగా మూడు సార్లు విజయం సాధించడంతో ఎడ్లకు మంచి గిరాకీ వచ్చిందని నాలుగు ఎడ్లకు సుమారు రూ.35 లక్షలు పలుకుతుందన్నారు. పందెంలో నెగ్గి గంటల వ్యవధిలోనే వాటికి ఎవరు విషమిచ్చి చంపారో అర్థం కావడం లేదని బోరున విలపించాడు. ఎడ్లు మృతి చెందినట్లు విషయం తెలుసుకున్న అక్కడి రైతులంతా తరలి వస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు అరటి పండ్లలో విషం పెట్టి తినిపించి ఉంటారని పశు సంవర్ధక శాఖ ఏడీ వై.శ్రీనివాసరావు పేర్కొంటున్నారు. ఎడ్ల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్యేంద్రతో పాటు ఆ గ్రామ రైతలందరూ డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news