ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన ఫైల్ కదిలింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన క్రమశిక్షణ కేసుల వివరాలపై దృష్టి పెట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉద్యోగులపై విజిలెన్స్, శాఖపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు.
దీనివల్ల వారి పనితీరుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసుల వల్ల వారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కొన్ని కేసులు 20 సంవత్సరాలనుండి పెండింగ్ లో ఉన్నాయని.. ఇలా పరిష్కారం కాకుండా ఉన్న కేసులు తన దృష్టికి వచ్చాయని అన్నారు.
ఇందుకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శిలను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మూడు వారాలలోగా ఈ నివేదికను అందజేయాలని ఆదేశించారు. అయితే విచారణ ప్రారంభించిన సందర్భంలో అందుకు తగిన పత్రాలు అందుబాటులో ఉండడం లేదని, ఈ కారణంగానే విచారణలో జాప్యానికి కారణం అవుతుందని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు.