రాజ్యాంగ పదవిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ లు ఇద్దరు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. నాసిక్ లో గంగానది జన్మించి పూణే మీదుగా ప్రవహించిందన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి మాటల మాదిరిగానే, స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో ఎటువంటి స్కాం జరగకపోయినప్పటికీ పులివెందుల, కడప బ్యాచ్ ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారని రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. చంద్రబాబు గారిపై తప్పుడు కేసు నమోదు చేయమని ఆదేశించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ఆ వంటకాన్ని అద్భుతమైన దినసులతో వండి వార్చిన వ్యక్తి ఏపీసీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కీం రాష్ట్రంలో అమలు చేసినప్పుడు, ఆ కార్పొరేషన్ కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్నది ప్రేమ్ చంద్రారెడ్డా? కాదా?? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యదర్శి హోదాలో ఆయన నవంబర్ 2014లో నోట్ ఫైల్ పై సంతకం చేసి, ఫైల్ మూవ్ చేయలేదా?? అంటూ నిలదీశారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచిదని, లేకపోతే ఈ వ్యవహారం భూమరాంగై ఆయన ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు. ఈ కేసులో ఎటువంటి పసలేదని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారని, ఈ కేసు ఏరకంగా చూసినా చెల్లదని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.