ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఢిల్లీ నుంచి పసుపు మీడియాలో ధిక్కార స్వరాన్ని మరింత వినిపించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఓ ఛానల్ లో మాట్లాడుతూ.. తన చుట్టూతా రెండు వారాల్లో కేంద్ర బలగాలు రక్షణగా రానున్నాయని తెలిపారు. అలాగే.. అమరావతినే రాజధానిగా ఉంచాలనే స్వరాన్ని బలంగా వినిపించేందుకు ఢిల్లీని స్థానంగా ఎంచుకొని ఛానళ్లలో వ్యాఖ్యానాలు దంచికొట్టేందుకు మార్గాన్ని ఎంచుకున్నట్లే తెలుస్తోంది. తాజాగా ఆయన మరోసారి స్పందించారు!
తాజాగా మాట్లాడిన ఆర్.ఆర్.ఆర్… గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సింగిల్ గా అమరావతి కేంద్రంగానే రాజధాని ఉండేలా మద్దతు తెలిపారని.. ఇప్పుడు ప్లూరల్ గా మూడు రాజధానులు అనడం సరిగ్గా లేదని దుయ్యబట్టాడు. అలాగే.. కనీసం ఎగ్జిగ్యూటివ్ రాజధానిగా అమరావతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదిశగా ప్రభుత్వం పయనిస్తే బాగుంటుందని కూడా హెచ్చరికలు సవినయంగా చేస్తున్నట్లు తెలిపారు.
అసలు ఆర్.ఆర్.ఆర్. ఏమన్నారంటే.. తనకు భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు సొంత పార్టీ అధికారంలో ఉన్న “మా పార్టీ”లోనే రక్షణ లేదని కోర్టులకు ఎక్కడం చాలా దుదదృష్టకరంగా ఉందని ఆయన అన్నారు. అలాగే… రాష్ట్ర ప్రభుత్వ భద్రతను నమ్మితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు అవుతుందని కూడా తెలిపారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసుల భద్రతపై ప్రస్తుతం మా ముఖ్యమంత్రి అనుమానం వ్యక్తం చేశారని, తాను కూడా అలాగే… ఇప్పుడు ఆయన బాటలోనే వెళుతున్నానని స్పష్టం చేశారు.
అదేవిధంగా రాజధాని ప్రజల ఉసురు, శాపాలు తగలకుండా సీఎం అమరావతిని “ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్”గా అయినా కనీసం ప్రకటిస్తే బాగుంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా అమరావతి రైతులను ప్రభుత్వం తడిగుడ్డతో గొంతుకోసిందని అన్నారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని గత గురువారం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశానని.. అయితే రాష్ట్ర ప్రభుత్వ రక్షణ వద్దని.. కేంద్ర ప్రభుత్వ రక్షణ మాత్రమే కావాలని పిటీషన్ లో కోరానని వెల్లడించారు. ఆ దిశగా.. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ను కలిసి తన రక్షణ కోసం బలగాలు కావాలని త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరతామని వివరించారు.
అంతేకాకుండా నియోజకవర్గంలో పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్లి ప్రజలకు సేవ చేసేందుకు తగిన రక్షణ అవసరమని అన్నారు. అలాగే… ఓ రాష్ట్ర మంత్రి తనపై కేసు పెట్టడం అంటే అంత ఆషామాషీ కాదని.. ఇది ప్రభుత్వమే పెట్టించిందనే గ్రహించవలసి వస్తుందని తెలిపారు. అందుకే కేంద్ర రక్షణ కోరానని తన సమస్య రాష్ట్రప్రభుత్వంతో కాబట్టే తనకు రాష్ట్ర ప్రభుత్వ రక్షణ వద్దని కోరినట్లు తెలిపారు. కాగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా.. రాజధాని ప్రజల సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఆర్.ఆర్.ఆర్. వివరించారు.