తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును అంతమొందించేందుకు తమ పార్టీ నాయకులు కుట్ర పన్నారనేది వాస్తవం అని, తాము వేసిన ఎత్తు చిత్తయ్యేటప్పటికీ, ఒక పనికిమాలిన కేసులో A1 గా ఆయన్ని చూపించి భయభ్రాంతులకు గురిచేయాలని భావించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఎన్ ఎస్ జి రక్షణ లేకపోతే ఐదు నిమిషాలలో చంద్రబాబు నాయుడు గారిని లేపేసేవారని గతంలో స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చేసిన వ్యాఖ్యలు, నల్లజెండాలు పట్టుకుని తమ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం అందజేస్తామని వెళ్లడం వంటి సంఘటనలను పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు గారి హత్యకు తమ పార్టీ నాయకులు పథకరచన చేసినట్లు స్పష్టం అవుతుందని అన్నారు.
చంద్రబాబు గారి సభకు 5 వేల మంది హాజరు కాగా, అందులో మూడు వేల మంది టీడీపీ నాయకులని సెల్ ఫోన్ సిమ్ కార్డు ఆధారంగా పోలీసులు గుర్తించారట అని, మరో రెండు వేల మంది ఎవరో తెలియదని, ఎక్కడ నుంచో వచ్చిన గూండాలని, బహిరంగ సభ నిర్వహిస్తే ప్రజలు రాకుండా ఉంటారా?, వాళ్లని గుండాలని అంటారా?? అంటూ రఘురామకృష్ణ రాజు గారు విస్మయం వ్యక్తం చేశారు. సభకు హాజరైన వారిలో మూడు వేల మంది టీడీపీ నాయకులని గుర్తించిన పోలీసులు, మిగిలిన 2000 మంది చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి తమ పార్టీ వారే పంపిన గుండాలని ఎందుకు అనుకోకూడదో చెప్పాలని నిలదీశారు. కుప్పం, తిరుపతి ఎన్నికల సందర్భంగా లారీలలో, బస్సులలో ఇతర ప్రాంతాలకు చెందిన వారిని స్థానిక మహా నాయకుడు ఒకరు తరలించిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు.