తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అక్కడి ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేయగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిని ప్యాలెస్ లకే పరిమితం చేస్తారని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు. అరువు దొరికితే చాలు కరువు తీరిందన్నట్లుగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఉందన్నారు. రోడ్ల మరమ్మతులు చేయడానికి గతంలో పెట్రో ఉత్పత్తులపై ఒక్క రూపాయి సెస్సు విధించారని, ఇది చాలదన్నట్లుగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందారని తెలిపారు.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రహదారులను కాస్తా, నాబార్డ్ నుంచి రుణం పొందడానికి జిల్లా రహదారులుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్ర రహదారులకు నాబార్డ్ రుణం ఇవ్వకపోవడం, జిల్లా రహదారుల రుణ మంజూరీకి అంగీకరించడం వల్లే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రివర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారని అన్నారు. రోడ్ల మరమ్మత్తుల కోసం బయటి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, సొంత కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి, వారికి నాబార్డ్ నిధులను కట్టబెట్టి పర్సెంటేజీలను కొట్టివేయడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది తప్ప ప్రజల రోడ్ల కష్టాలన్నది తీరే అవకాశాలు లేవనేది సుస్పష్టమని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు.