జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెడన బహిరంగ సభలో చెప్పిన రూపాయ పావలా కథ మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. పెడనలో స్థానిక ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ గారు గట్టి హెచ్చరిక చేశారని, తప్పులు చేస్తున్నావు… మా ప్రభుత్వం వచ్చాక ఉపేక్షించేది లేదని గట్టి డోస్ ఇచ్చారని అన్నారు.
అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ, జనసేన కూటమి అవసరం ఎంతో ఉందని, జగన్ మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయిన andhra pradesh రాష్ట్ర ప్రజలను ఆదుకోవలసిన ఆవశ్యకత ఉందన్న పవన్ కళ్యాణ్ గారు, టీడీపీకి ఎంతో అనుభవం ఉందని, జనసేనకు యువ రక్తం ఉందని, అనుభవం, యువరక్తం కలిస్తే అద్భుత పరిపాలన వస్తుందన్న పవన్ కళ్యాణ్ గారి మాటలు అక్షర సత్యాలని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.
టీడీపీ, జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని తాను గత ఏడాదిన్నరగా చెబుతూ వస్తున్నానని, ఈ రెండు పార్టీలతో కలిసి మూడవ పార్టీ కూడా వస్తుందని చెప్పానని, కానీ తమ పార్టీ నాయకులు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని… అది మేనేజ్ చేశాం, ఇది మేనేజ్ చేశామని చెప్పుకుంటూ వచ్చారని, ఇప్పుడు వారికి తగిన శాస్తి జరగబోతుందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.