ప్రజల జీవించే హక్కును జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని, ప్రజల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్న విలువైన సమాచారం వారి జీవించే హక్కును పెను ప్రమాదంలోకి నెడుతోందని, వాల్తేరులో వరలక్ష్మి అనే మహిళను వాలంటీర్ చేసిన హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ప్రజలపై వాలంటీర్ల ఆగడాలు, మహిళలపై అత్యాచారాలు ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నాయని, వాల్తేరులో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి వరలక్ష్మి అనే మహిళ వద్ద పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఆమెను హత్య చేయడం వారి ఆగడాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
వాలంటీర్ల ఆగడాలు పెచ్చు మిరడానికి వారిలో జవాబుదారి తనము, బాధ్యత అన్నది లేకపోవడమే కారణమని, ఎటువంటి బాధ్యత జవాబుదారితనం లేని వాలంటీర్లను కొంపల మీదికి వదలివేయడం వల్లే ఈ తరహా దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన దరిద్రపు ఆలోచనల వల్లే, కాల కూట విషం లాంటి వాలంటీర్ వ్యవస్థ ఆవిర్భవించిందని, వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పడానికి రాజకీయ పార్టీలు వెనుకంజ వేసినా, తాను నిస్సంకోచంగా , ఒక బాధ్యత గల పార్టీ సభ్యునిగా తన అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడనని, అసలు వాలంటీర్లు చేస్తున్న పని ఏమిటి? అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ప్రతి నెల ఒకటవ తేదీన వృద్ధులకు పింఛన్లు ఇవ్వడమే కదా వారి పని, ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం అవసరమా?, వృద్ధులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థనే ఎందుకు?, పంచాయతీరాజ్ వ్యవస్థ అందుబాటులో ఉంది కదా అని ప్రశ్నించారు.