ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ తరఫున వాదనలను వినిపిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పదే పదే చెప్పిన విషయమే చెబుతుంటే న్యాయమూర్తి గారు అసహనం వ్యక్తం చేసి ఉండవచ్చునని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే, దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమేనని పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసి ఉండవచ్చునని అన్నారు.
ఇదే విషయం తొలుత ఎన్టీవీ, టీవీ9 లో స్క్రోలింగ్ వేశారని, ఆ తరువాత అదే విషయాన్ని టీవీ5, ఏబీఎన్ లో కూడా స్క్రోలింగ్ వేశారని, టీవీ5, ఏబీఎన్ లో వచ్చిన స్క్రోలింగ్ చూసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీడియా ఎదుట స్పందించిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు గారు ప్రదర్శించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వీఆర్ గారు, జగ్గయ్య గారు, కమల్ హాసన్ గారు, తమిళంలో శివాజీ గణేషన్ గారి వంటి వారు ఎంతో మంది మహానటులను తాను చూశానని, 90 సెకండ్ల వ్యవధిలో సుధాకర్ రెడ్డి గారు వీరందరినీ మరిపించే విధంగా నటించారని అన్నారు. ఒక్కొక్క పదం పలకడంలో జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీఆర్ గారిని తలపించగా, స్టైలిష్ గా మాట్లాడడంలో ఏఎన్ఆర్ గారిని గుర్తు చేశారని, పెడ బొబ్బలు వేయడంలో శివాజీ గణేషన్ గారిని, జగ్గయ్య గారిని గుర్తు చేస్తే… వాగ్దాటిలో ఎస్వీఆర్ గారిని మరిపించారని అన్నారు.