పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుడి స్మరించుకునేటప్పుడు కొంత మంది పనికిమాలిన వెధవలను కూడా గుర్తు చేసుకోవలసిన అవసరం రావడం మన దౌర్భాగ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మే 20వ తేదీ తర్వాత అటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాకూడదని ఆయన కోరుకున్నారు. వచ్చే ఏడాది పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు.

శనివారం పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకొని రఘురామకృష్ణ రాజు గారు ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ఆయన నిజమైన నిరాహార దీక్ష చేశారన్నారు. ప్రస్తుతం కొంత మంది డమ్మీ నిరాహార దీక్షలను చేస్తూ, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాహార దీక్ష చేసిన వెంటనే పోలీసులు రావడం.. కాస్తా ఆలస్యమైతే, వారే పోలీసులకు ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారని అన్నారు. ఊళ్లకు ఊళ్లనే పంచుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈరోజుల్లో, నెల్లూరుకు చెందిన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు. తెలుగు వారికి ఈరోజు ఒక గుర్తింపు ఉందంటే దానికి సృష్టికర్త పొట్టి శ్రీరాములు గారేనని రఘురామకృష్ణ రాజు గారు కొనియాడారు.