రాజోలు రాజ‌కీయం యూట‌ర్న్‌…  జ‌న‌సేన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడంటే…!

-

తూర్పుగోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం రాజోలు. ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ అయిన ఈ నియోజ‌క వ‌ర్గం నుంచి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి రంగంలోకి దిగిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ విజ‌యం సాధించారు. నిజానికి ఈయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి కొత్త నాయ‌కుడు కాదు. గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం సాదించారు. 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. అయితే, ఇప్పుడు జ‌న‌సేన త‌ర‌ఫున గెలిచినా.. రాజ‌కీయంగా ఆయ‌న వైసీపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తున్నారు. కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ.. ఆయ‌న జ‌న‌సేన‌కు దూరంగా ఉన్నారు.

ఇక, ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత‌.. ఇక్క‌డ రాజ‌కీయాలు చేయ‌డం అటుంచితే.. జిల్లా వ్యాప్తంగా వైసీపీలో త‌న హ‌వా చలాయించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వైసీపీ నేత‌ల‌తో ములాఖ‌త్ అయి.. త‌న ప‌నులు చేయించుకుంటున్నార‌ని, కేవ‌లం త‌న వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని అంటున్నారు. ఇది రాజ‌కీయంగా రాపాక‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తెచ్చిపెడుతోంది. ఇప్ప‌టికి ఏడాది గడిచిపోయినా.. రాజోలులో ఏ ఒక్క అభివృద్ధి కార్య‌క్ర‌మం కూడా ముందుకు సాగ‌లేదు. దీనిని అదునుగా తీసుకున్న టీడీపీ నేత‌, రెండు సార్లు ఈ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన గొల్ల‌ప‌ల్లి సూర్యారావు.. పార్టీని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

స్థానికంగా ఎమ్మెల్యే ఏమీ చేయ‌డం లేద‌ని, వివాదాల్లో చిక్కుకుంటున్నార‌ని, ఆయ‌న‌కు అభివృద్ధి క‌న్నా కూడా త‌న ప‌నులే ముఖ్య‌మ‌నే ధోర‌ణిలో ముందుకు సాగుతున్నార‌నే ప్ర‌చారం చేస్తున్నారు. ఇది దీర్ఘ‌కాలంలో రాపాక‌కు మేలు చేయ‌బోద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలోనూ కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ‌ప్ప‌టికీ.. రాపాక చేసిందేమీ లేద‌ని, విభ‌జ‌న స‌మ‌యంలో త‌న సొంత ప‌నులు చ‌క్క‌బెట్టుకుని కూడ‌బెట్టు కున్నార‌నే విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ ఉన్నాయి.

ప్ర‌స్తుతం ఎస్సీ, ఎస్టీల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధా న్యం ఇస్తోంది. దీంతో ఆయా కార్య‌క్ర‌మాల‌ను అందిపుచ్చుకుని త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌లు చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం మానేసిన రాపాక‌.. రాజ‌కీయంగా త‌న హ‌వా నిలుపుకొనేందుకుప్ర‌య‌త్నిస్తున్నారు. ఫ‌లితంగా ఇక్క‌డ టీడీపీ ఆధిప‌త్యం పెరుగుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా రాపాక మార‌తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news