కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ఏపీలో పెద్దగా వర్షాలు పడకున్న మహారాష్ట్ర, కర్ణాటక, మొన్నటిదాకా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు పశ్చిమ కనుమల్లో వానలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతూ పోతోంది. దీంతో శ్రీశైలంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. 2009 వరదల తర్వాత జలాశయానికి రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు.
నిన్న రాత్రి వరకు జూరాల, సుంకేసుల, హంద్రీనీవా నుంచి శ్రీ శైలానికి 5 లక్షల 44 వేల 439 క్యూ సెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. దీంతో వరద ఉధృతిని అంచనా వేసిన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 18 గేట్లను ఎత్తారు అధికారులు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులు దాటింది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 308 టీఎంసీల నీరుంది. సాగర్ నుంచి మొత్తం 4 లక్షల 23 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది.