తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోనూ ఈ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారన్న దానిపై అధ్యయనం చేస్తోంది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ ఎలా అనే విషయాలపై రీసెర్చ్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఏపీలో అమలుచేస్తే, ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
టికెట్ల రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్, సీజనల్ పాస్‌లు వంటి రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి రాబడి తగ్గుతుందని అధికారులు చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో 40 శాతం మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారని నివేదిక తయారు చేశారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని అధికారులు పేర్కొన్నారు.