అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ, క్విడ్ ప్రోకో ఊసే తెలియని అమాయక చక్రవర్తులైన శ్రీమాన్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఎన్నో కేసుల్లో A2 నిందితునిగా ఉన్న శ్రీమాన్ విజయ సాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, వై వి సుబ్బారెడ్డి గారు ఎన్నికలకు ముందు పార్టీకి 11 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చిన వ్యక్తి భూమిని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 22A నుంచి తొలగించడాన్ని ఏమంటారో చెప్పాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు ఎంవివి బిల్డర్స్ పేరిట తమ పార్టీకి 9 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారని ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ తన బ్యాంకు ఖాతా నుంచి నేరుగా మరొక రెండు కోట్ల రూపాయలను 2018 ఆగస్టు 31 వ తేదీన తమ పార్టీకి విరాళంగా అందించారని తెలిపారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందుగా, ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా గుర్తించిన ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ గారు తమ పార్టీకి పెద్ద మొత్తంలో విరాళాన్ని ముట్ట చెప్పారని, విశాఖపట్నం జిల్లా మధురవాడలో వీర వెంకట సత్యనారాయణ గారు 10 ఎకరాలలో ఒక పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మించారని, అప్పటికి ఆ స్థలంలో నిర్మించిన ఇండ్లు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో, కొనుగోలుదారుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించిన ఆయన, తన కంపెనీ ద్వారా, వ్యక్తిగతంగా మొత్తం 11 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కుల ద్వారా ఆ మొత్తాన్ని అందజేశారని తెలిపారు. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019, అక్టోబర్ 28వ తేదీన సత్యనారాయణ గారికి చెందిన 10 ఎకరాల స్థలాన్ని 22A నుంచి ప్రభుత్వం తొలగించిందని, కేవలం 10 ఎకరాల స్థలాన్ని మాత్రమే 22A నుంచి తొలగించి, మిగతా స్థలాలను ఎందుకు తొలగించలేదన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయిందని అన్నారు.