ఎన్నికల వరకు కృష్ణుల్లా కనిపించే ప్రజలు ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నికృష్టుల్లా కనిపిస్తారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం జగన్ మోహన్ రెడ్డి గారు గొర్రెల కాపరి పాత్రలోకి మారిపోయి ప్రజలందరినీ గొర్రెలుగా భావిస్తారని మండిపడ్డారు. అందుకే ఆయన అందరి నెత్తిన చేతిని పెడుతుంటారన్నారు.
ప్రజలంతా శ్రీకృష్ణులని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి గారు తనని తాను అర్జునుడితో పోల్చుకుంటున్నారన్న ఆయన, తనని ప్రోత్సహించే కృష్ణులు, కృష్ణారెడ్డిలని ఈయనేమో అర్జున్ రెడ్డి అని అనుకుంటున్నారా? అంటూ ప్రజలు అపహాస్యం చేస్తున్నారన్నారు.
ఎన్నికల వరకైనా ఎమ్మెల్యేలను నికృష్టుల్లా కాకుండా కృష్ణుల్లా చూసుకోవాలన్నారు. అడిగిన సమయంలో వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని వై.యస్ అర్జున్ రెడ్డి గారిని కోరుతున్నానని అపహాస్యం చేశారు. పురాణ ఇతిహాస పాత్రలను అపహాస్యం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇతరులను కౌరవులుగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.