ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆత్మకథగా తీసిన వ్యూహం చిత్రం సంక్రాంతి పండగకు, రిపబ్లిక్ డే కి కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారు తెర వెనుక రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం చిత్రంపై హైకోర్టులో వాడీ వేడి వాదనలు కొనసాగాయని, రాత్రి 11 గంటలకు సెన్సార్ సర్టిఫికేట్ పై హైకోర్టు స్టే విధించిందని, జనవరి 11వ తేదీన రివైజ్డ్ కమిటీ రిపోర్ట్, అబ్జర్వేషన్ ను ఫైల్ చేయాలని ఆదేశించారని తెలిపారు.
ఈ సినిమాను రాంగోపాల్ వర్మ గారు కాకపోతే మరొక దర్శకుడితో రూపొందించి ఉండేవారని, సినిమాలో చూపించే వ్యక్తుల అనుమతి తీసుకోకుండా వారి పాత్రలను చిత్రంలో చూపించడానికి వీలు లేదని అన్నారు. వ్యూహం చిత్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పాత్రలను చూపించారని, పవన్ కళ్యాణ్ గారి పేరును ప్రవణ్ కళ్యాణ్ గా పేర్కొంటూ, ఇది వేరే క్యారెక్టర్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
సినిమాలో చంద్రబాబు నాయుడు గారి పాత్రను చూపించడానికి ఆయన అనుమతి తప్పనిసరి అని, ఎటువంటి అనుమతి లేకుండా ఆయన పాత్రను చూపించడమే కాక, వ్యక్తిత్వ హననానికి పాల్పడడాన్ని న్యాయవాది వున్నం మురళీధర్ రావు గారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత, సినిమా విడుదలపై ఖచ్చితంగా స్టే విధిస్తారని తాను భావించానని, అలాగే జరిగిందని అన్నారు.