రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయ దుందుభి మ్రోగించడం ఖాయమని రఘురామకృష్ణ రాజు గారు ధీమా వ్యక్తం చేశారు. నూటికి నూరుపాళ్ళు సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయని, ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియనిది కాదని, అందుకే ఈ టీడీపీ, జనసేన కూటమిని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
టీడీపీ, జనసేన కూటమిని చూసి జగన్ మోహన్ రెడ్డి గారికి వెన్నులో వణుకు మొదలయ్యిందని, అదే కలవరంతో విద్యా దీవెన సభలో విద్యార్థుల గురించి మాట్లాడాల్సింది పోయి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడమే కాకుండా, టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల గురించి, వాటి యజమానులైన రామోజీరావు గారు, రాధాకృష్ణ గారపై యధావిధిగా విమర్శలు చేశారని అన్నారు. అయినా ఫలితం శూన్యమని, పబ్లిక్ ఇప్పటికే డిసైడ్ అయిపోయారని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయని, ఆ రెండు పార్టీలతో కలిసి ప్రజల కోసం మరొక పార్టీ కూడా కలిసే అవకాశం ఉందని తెలిపారు.