మేము కలిశాం… కలిసే పోటీ చేస్తాం… టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించారన్న డిఫెరెన్స్ మినహా ఆయనతో మరే ఇతర విభేదాలు లేవని, ఈసారి ఎటువంటి విభేదాలు ఉండవని ఖచ్చితంగా చెప్పగలనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ నాయకుల కోసమే కుండ బద్దలు కొట్టినట్లు పునరుద్ఘాటించారని అన్నారు.
ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని తమ పార్టీ నాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. తమ పార్టీకి 15 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని తాను చెప్పినట్లుగానే, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారని, ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఉండగా అక్టోబర్ 11వ తేదీన సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ అనంతరం పరిస్థితులు మారవచ్చునని, తమ పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోవచ్చునని అన్నారు. అనారోగ్య కారణం వల్ల వై.యస్. భాస్కర్ రెడ్డికి కస్టడీ బెయిల్ మంజూరు చేయగా, మరో రెండు నెలల పాటు బెయిల్ పొడగించాలని ఆయన కోరడం విడ్డూరంగా ఉందని, అదేదో రెండు రోజులు పొడిగించమన్నట్లుగా ఆయన రెండు నెలలు పొడిగించాలని అడిగారని అపహాస్యం చేశారు.