ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలన్నింటికీ జగన్ మోహన్ రెడ్డి తన పేరిట జగనన్న క్రీడా ప్రాంగణాలుగా నామకరణ చేయనున్నారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి డాక్టర్ చదివారు కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా నామకరణ చేశారని, జగన్ మోహన్ రెడ్డి గారు ఏ క్రీడల్లో ప్రావీణ్యుడో తెలుసుకుందామని ప్రయత్నించగా… ఆయన క్రికెట్లో ఒక్క బ్యాటింగ్ మాత్రమే చేసేవారని జగన్ మోహన్ రెడ్డి గారి చిన్ననాటి సన్నిహితులు తెలిపారని, ఏమాత్రం క్రీడా స్ఫూర్తి లేని జగన్ మోహన్ రెడ్డి పేరు క్రీడా ప్రాంగణాలకు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు అయితే తన పేరు, లేదంటే తన తండ్రి పేరు పెట్టుకుంటున్నారని, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేశారని, రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లకు, పార్కులకు, మెడికల్ కాలేజీలకు వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టగా, ప్రభుత్వ పథకాలకు, క్రీడా ప్రాంగణాలకు జగనన్న పేరు పెట్టారన్నారు. ఇక రాష్ట్రానికి పేరు మార్చడం ఒక్కటే తక్కువన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ పేరును జగన్ ప్రదేశ్ గా నామకరణ చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. లేకపోతే తమిళనాడు కూడా కలిసి వచ్చే విధంగా జగన్ నాడు అని పేరు పెట్టాలంటూ అపహాస్యం చేశారు. ఇక తిరుపతి పేరును కూడా మార్చి జగన్నాధపురం గా పెట్టాలని, మెట్ల దారిలో అవసరమైతే ఆయన విగ్రహాన్ని పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఇవన్నీ అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, వరుస సంఘటనలను పరిశీలిస్తే జరగబోయేది ఇదేనని అర్థమవుతుందని అన్నారు.