తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూనే.. తొమ్మిదన్నరేళ్ల పాలనలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోందని చెబుతూ.. ఈసారి తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్, మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు దుబ్బాక.. మధ్యాహ్నం 12.30 గంటలకు హుజూరాబాద్.. 2 గంటలకు మానకొండూర్.. 3 గంటలకు మహేశ్వరం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ నగర్.. 5 గంటలకు ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసే కార్నర్ మీట్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.