పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్లితే.. చిలకలూరి పేట మండలం వేలూరి గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు ఆటోలో వస్తున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తోంది.
ఈ క్రమంలో లింగంగుంట్ల బస్టాప్ వద్ద గణపవరం రోడ్డు నుంచి ఒక్కసారిగా ఆటో చిలుకలూరిపేట రోడ్డులోకి వచ్చింది. ఇది గమనించిన ఆర్టీసీ డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు. బస్సు కింద పడి ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఆటోలోని కూలీల్లో యాకసిరి హనుమయమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ తో సహా క్షతగాత్రులైన 14 మంది కూలీలను చిలుకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. అక్కడ చికిత్స అందించే లోపే గన్నవరపు శివపార్వతి మరణించారు. తీవ్రగాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న షేక్ హజరత్ వలీ(65)ని గుంటూరు కి తరలించారు. శివకుమారి (60), సురుగుల కోటేశ్వరమ్మ(60)ను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ తో సహా గాయపడిన మరో 11 మందికి చిలుకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.