ఏపీలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

ప్రకటించినట్టుగానే ఏపీలో ఈరోజు ఉదయాన్నే సిటీ బస్సులు రోడ్డెక్కాయి. విజయవాడ, విశాఖపట్నంలో ఈ బస్సుల్ని నడపుతున్నారు. ఆ తర్వాత పరిస్థితిని పరిశీలించి రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ మొదలయ్యాక అంటే సుమారు ఆరేడు నెలలుగా సిటీ బస్సులు రోడ్డెక్కలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖలో ఈరోజు నుండి 110 బస్సు సర్వీసులని ఆర్టీసీ నడుపుతోంది. ఇక విజయవాడలో తొలి దశలో 200 బస్సులు ఆర్టీసీ నడుపుతోంది. పరిస్థితిని బట్టి సర్వీసులు పెంచే, తగ్గించే అవకాశం ఉంది.

ఇక ఇదే విషయం మీద నిన్న ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటించి సీటీ బస్సులను తిప్పుతామని అన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సిటీ బస్సులను నడపడం భారీగా నష్టం చేకూర్చే అంశంగా ఉంటుందని అయినా సరే బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదని అన్నారు. వృద్ధులని బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నామన్న ఆయన అత్యవసర పరిస్థితులంటూ కొందరు వృద్ధులు వస్తున్నారని అన్నారు. అలా వచ్చే వృద్ధుల బస్ ప్రయాణాలను నిరుత్సాహాపర్చేందుకే బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా రద్దు చేశామని, సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింప చేస్తామని ప్రకటించారు.