వంటింట్లో ఉల్లిపాయలు లేక తల్లడిల్లుతున్న బంగ్లాదేశ్‌తోపాటు పలు దేశాలకు భారత్ గుడ్‌న్యూస్ చెప్పింది. చాలా రోజులుగా ఓడరేవుల వద్ద ఉన్న ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి అనుమతి ఇవ్వడంతో బంగ్లాదేశ్ ఊపిరిపీల్చుకుంది. అయితే.. ఈ ఉల్లిపాయలను బంగ్లాదేశ్ సహా అన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించిందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కోల్‌కతా జోన్‌లో ఓడరేవు వద్ద 20,089 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు, ముంబై -2 జోన్‌లో 4,576 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు ఉంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే.. త్రిచి, నాగ్‌పూర్ వంటి ఇతర ప్రదేశాలలో 933, 258 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు ఉన్నాయి.
అంతకుముందు.. ఉల్లిపాయ ఎగుమతులను నిషేధించాలన్న భారత్ నిర్ణయంపై బంగ్లాదేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తరువాత ఈ పరిణామాలు జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఎగుమతులను నిషేధించి తక్కువ ధరకే దేశ ప్రజలకు ఉల్లిపాయలను అందించాలని మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే అన్నిరకాల ఉల్లిపాయలను ఎగుమతి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో ధరలు అమాంతంగా పెరిగాయి. అంతేగాకుండా.. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ నౌకాశ్రయాలు, భూ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌కు చెందిన వందలాది ఉల్లి ట్రక్కులు చిక్కుకుపోయాయి.