రైలు ప్లాట్ఫార్మ్ మధ్య ఇరుక్కుపోయి గాయపడిన శశికళ చికిత్స పొందుతూ మృతి

బుధవారం విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని రైలు, ప్లాట్ఫారం మధ్య ఇరుక్కుపోయింది. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చిన ఆమె.. రైలు దిగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు గంటన్నర పాటు యువతి రైలు, ప్లాట్ఫామ్ మధ్యనే నరకయాతన అనుభవించింది. చివరికి గంటన్నర పాటు శ్రమించిన రైల్వే సిబ్బంది యువతిని బయటకు తీశారు.

అనంతరం రెస్క్యూ బృందం యువతిని షీలా నగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని దువ్వాడ కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమె అన్నవరానికి చెందిన శశికళ. అయితే ఈ ప్రమాదంలో ఆమెకి నడుము భాగం ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. అయితే నేడు పరిస్థితి విషమించడంతో కన్ను మూసింది. ఆమె మరణం వార్తతో కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది.