తిరుమల ఏడు కొండల వారి దేవస్థానం అంతా భక్తలతో నిండిపోయింది. ఇవాళ గరుడ సేవను చూసేందుకు భక్తులు లక్షలాది మంది తిరుమలకు పోటెత్తారు. భక్తుల గోవింద నామ స్మరణల మధ్య గురువారం సాయంత్రం శ్రీవారి గరుడ సేవ ప్రారంభం అయింది. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ.. భక్త కోటికి దర్శనం ఇచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు వెళ్తుంగా.. భక్తుల కొలాటాలు, డప్పు వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల మధ్య వాహన సేవ కోలహలంగా సాగింది.
భారీగా తరలివచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మారుమ్రోగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి వాహన సేవలో పాల్గొన్నారు. ఈ గరుడ సేవకు భక్తులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టీటీడీ భద్రతా పరమైన ఏర్పాట్లు చేసింది. తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.