సీఎం జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 30వేల మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని.. దీని కోసం సుమారు 90వేల ఎకరాలు అవసరమని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని.. ప్రతి ఎకరాకు రైతుకు కనీసంగా రూ.30 వేల లీజు వస్తుందని ప్రకటించారు.
![cm jagan](https://cdn.manalokam.com/wp-content/uploads/2022/05/move-review-ppas-only-to-ensure-competitive-prices-cm-jagan-mohan-reddy.jpg)
దీంతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న మిగతా ప్రాజెక్టులు కూడా త్వరగా సాకారమయ్యేలా చూడాలని.. ఈ ప్రత్యామ్నాయం పై అధికారులు దృష్టి సారించి రైతులకు మేలు చేసే చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారాలని.. గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎలక్ట్రానిక్స్, పర్యాటక– ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని.. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయని చెప్పారు. మరిన్ని గ్లోబల్ కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని.. కొప్పర్తిలో రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు.