గవర్నర్ గారూ..! అసలు ఈ జగన్ ఏం చేస్తున్నాడంటే ?

అసలు ఏపీ బీజేపీ నేతలకు ఏమైందో ఏంటో తెలియదు కానీ, మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం కు  అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తూ వచ్చారు. జగన్ పై ఈగ కూడా వాలకుండా కాపాడుతూ వచ్చారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసుకుంటూ, పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో జగన్ తో పోటీపడే పరిస్థితి ఉన్నా, ప్రస్తుతానికి మాత్రం తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీనే అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు వ్యవహరించారు. ఇదంతా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అంతకు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో టిడిపి కి అనుకూలంగా వ్యవహరించారు.

ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం బిజెపి జగన్ తీరుపై పదే పదే విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైన సంఘటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆందోళనలు చేస్తూ, ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు సైతం చేస్తోంది. తమ మిత్రపక్షమైన జనసేన పార్టీతో కలిసి బిజెపి వైసీపీ పై విమర్శలు చేస్తోంది. ఏపీలో బీజేపీ బలపడేందుకు ఇదే మంచి అవకాశం అని అభిప్రాయపడుతోంది. ఇప్పటి వరకు జగన్ తిట్టిపోసేందుకు ఏ అవకాశం లేకుండా ఉండేదని, ఇప్పుడు మాత్రం అంతర్వేది వ్యవహారాన్ని మాత్రం వదిలి పెట్టకూడదనే అభిప్రాయంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇక ఈ వ్యవహారంపై ఏపీ గవర్నర్ తో ఈ రోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో మతపరమైన వివాదాలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే ఈ విషయాల్లో కలుగజేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని వీర్రాజు కోరబోతున్నారు. ముఖ్యంగా అంతర్వేది ఆలయ ఘటనలో నిందితులను ఇప్పటికీ గుర్తించలేదని, ఈ ఘటనపై నిరసన తెలియజేసేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేశారని, సోము వీర్రాజు గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు.

అలాగే విజయవాడలో దుర్గమ్మ ఆలయ రథంపై సింహాలు మాయమైన వ్యవహారంపైనా, చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు గవర్నర్ ను కోరాబోతున్నారు. అలాగే అనేక అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు సోము వీర్రాజు నిర్ణయం తీసుకోవడంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

-Surya