చాలా సందర్భాల్లో నిబంధనలకు మినహాయింపులు ఇవ్వడం అనేది… సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారి కోసమో, సంపన్న వర్గాల వారి ప్రయోజనాల కోసమో అయి ఉంటుంది. కాని తాజాగా జరిగిన సంఘటన అందుకు భిన్నంగా.. బడుగుజీవుల కోసం నిబంధనలకు మినహాయింపులు ఇస్తూ నిర్ణయాలు తీసుకోవటం వంటి సంఘటన ఏపీలో చోటు చేసుకున్న పరిణామం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
కరోనా వేళ, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను సీరియస్ గా అమలు చేస్తున్న సమయంలో… ఊహించని రీతిలో చోటు చేసుకున్న సీన్ ఒకటి ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ను విధించటంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎంతోమంది తమకు సంబంధం లేని ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. అలాంటివారి పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలుత 21 రోజులు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు మే మూడు వరకూ సాగటం.. రానున్న రోజుల్లో లాక్ డౌన్ మరిన్ని రోజులు కనసాగుతుందనే కథనాలు వినబడతంతో ఈ పరిస్థితి మరింత జఠిలం అయ్యే సూచనలు ఉన్నాయి!
దీంతో.. వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కర్నూలు జిల్లాకు చెందిన వేలాది మంది వలస కూలీలు వ్యవసాయ పనుల కోసం గుంటూరు జిల్లాకు వచ్చారు. కరోనా పుణ్యమా అని వారంతా తమ సొంతూళ్లకు వెళ్లలేక జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఇలాంటివారంతా తమను తమ ఊళ్లకు పంపాలంటూ కనిపించినోళ్లనంతా వేడుకుంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అలాంటి వినతుల్ని అంతా లైట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకపాటి సుచరిత పత్రిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఊరి కాని ఊళ్లో.. ఉపాధి లేని వేళ ఉండి పోవటం కష్టంగా మారిందని.. ఏదోలా తమను తమ ఊళ్లకు పంపాలని ప్రాధేయపడ్డారు. వారి వేదనల్ని విన్న సుచరిత ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్నారు.
ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆమె.. అప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి.. కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు వీలుగా రోడ్ల మీదకు ఆర్టీసీ బస్సుల్ని తీసుకొచ్చారు. దీంతో.. తమ సొంతూళ్లకు వెళ్లిపోయే అవకాశం లభించటంతో కూలీలంతా విపరీతమైన ఆనందానికి గురయ్యారు. ఇలా.. మేకపాటి సుచరిత కారణంగా ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కిన వైనం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.