గాలి జనార్దన్‌రెడ్డి న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

-

బళ్లారి వెళ్లకుండా ఉండాలనే తన బెయిల్‌ షరతులను సడలించాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాది మీనాక్షి అరోడాపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బిడ్డకు జన్మనిచ్చినందున ఆయన నాలుగు వారాలు బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలని గురువారం ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించగా.. దానిపై తమకు సమాచారం లేదని సీబీఐ న్యాయవాది చెప్పారు. ఆ విషయాన్ని అధికారులు ధ్రువీకరించి చెప్పాలంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

శుక్రవారం రోజున సీబీఐ న్యాయవాది మాధవీ దివాన్‌ తమ నివేదికను కోర్టు ముందుంచారు. ‘కుమార్తె ప్రసవించినందున ఆమెను చూడటానికి బళ్లారి వెళ్లడానికి అనుమతివ్వాలని జనార్దన్‌రెడ్డి కోరారు. ఆమె బళ్లారిలో ప్రసవించారనుకున్నాం. కానీ మా బృంద పరిశీలనలో జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మిణి గత నెల 26న ఉదయం బెంగళూరు రెయిన్‌బో ఆసుపత్రిలో చేరారు. 27న సిజేరియన్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసు విచారణ గురువారం (29న) మధ్యాహ్నం మూడున్నర గంటల దాకా జరిగింది. సాయంత్రం ఆయన కుమార్తె ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జయి బిడ్డతో రాత్రికి బళ్లారి చేరుకున్నారు’ అని విన్నవించారు.

జనార్దన్‌రెడ్డి న్యాయవాది మీనాక్షీ అరోడా స్పందిస్తూ సీబీఐ మరో స్థాయి కక్ష సాధింపునకు దిగిందని ఆవేశంగా అన్నారు. ‘అమ్మాయి బెంగళూరులో ప్రసవించిన మాట వాస్తవమే. కానీ వారు బళ్లారిలో కుటుంబంతోనే ఉంటున్నారు. అమ్మాయికి సిజేరియన్‌ జరిగింది. బళ్లారిలో బెంగళూరు స్థాయి ఆసుపత్రులు లేవు. అందుకే అక్కడికి వెళ్లారు. బళ్లారిలో ప్రసవం జరిగినట్లు నిన్న ఎలాంటి స్టేట్‌మెంట్‌ చేయలేదు’ అని ఆవేశంగా వాదించారు.

జస్టిస్‌ ఎంఆర్‌షా జోక్యం చేసుకుంటూ ‘మీరెందుకు గొంతు పెంచుతున్నారు మేడం? అది మీకెప్పుడూ మేలు చేయదు’ అని హెచ్చరికపూర్వకంగా సూచించారు. వెంటనే మీనాక్షీ అరోడా క్షమాపణలు కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ మీరు చెప్పాలనుకున్నవన్నీ చెప్పండి.. గొంతు మాత్రం పెంచొద్దన్నారు.

మీనాక్షి వాదనలు కొనసాగిస్తూ ‘ఇది సిజేరియన్‌ కాన్పు. బళ్లారి చిన్న పట్టణమైనందున కాన్పు కోసం బెంగళూరు తీసుకెళ్తే తప్పేమీ కాదు’ అని పేర్కొన్నారు. దాన్నేమీ మేం తప్పుపట్టలేదే? నిన్న కేసు విచారణ పూర్తయిన తర్వాత ఆసుపత్రి నుంచి అమ్మాయిని డిశ్ఛార్జి చేయించుకొని బళ్లారికి తీసుకెళ్లినట్లు మాత్రమే సీబీఐ చెప్పింది, బెంగళూరులో ప్రసవమైనట్లు మీరు చెప్పలేదే అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ విషయం తనకు తెలిసి ఉంటే చెప్పేదాన్నని గాలి తరఫు న్యాయవాది అన్నారు.

ఈ కేసు విచారణను ఇకపై రోజువారీ చేపట్టాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తున్నామని, సాక్షులు జైల్లో ఉన్నా వారిని ఎగ్జామినేషన్‌ చేయాలని ప్రాసిక్యూషన్‌కు చెబుతున్నామని జస్టిస్‌ షా అన్నారు. దీనిపై అక్టోబరు 10న లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news