ఏపీలో జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమ వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. 2 నెలల పాటు కొనసాగుతుందని తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో టీడీపీ నేతలు పర్యటిస్తారని తెలిపారు.
“క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటాం. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం. ఈ సభలో బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేస్తారు. జగన్ పాలనలో బీసీ సోదరులు చాలా నష్టపోయారు. వైఎస్సార్సీపీ సర్కార్ బీసీ సోదురులను ఇబ్బంది పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించింది. 16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేసింది. 56 కార్పొరేషన్లకు నిధులు.. విధుల్లేవు.” అని నారా లోకేశ్ మండిపడ్డారు.