పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలోని టోటోటాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 83 మందికి తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ట్యాంకర్ బోల్తా పడింది. ఆ సమయంలో సమీపంలో ఉన్న స్థానికులు అందులో నుంచి పెట్రోల్‌ను తీసుకెళ్లేందుకు పదుల సంఖ్యలో ట్యాంకర్‌ను చుట్టుముట్టారు. అదే సమయంలోనే భారీ పేలుడు సంభవించడంతో దాదాపుగా 40 మంది అక్కడికక్కడే మరణించారు.
పదుల సంఖ్యలో ప్రజలు మంటల్లో సజీవదహనమయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. అనేక మంది శరీరాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయని చెప్పారు. సామూహిక సమాధులు తవ్వి వారి అంత్యక్రియలను నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంధన ట్యాంకర్లు బోల్తా పడినప్పుడు వాటి నుంచి ఇంధనాన్ని తీసుకెళ్లేందుకు యత్నించవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికాలో పలు చోట్ల ఇలా బోల్తాపడిన వెంటనే ఇంధన ట్యాంకర్లు పేలిన ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇంధన ట్యాంకర్‌కు దూరంగా వెళ్లాలని చెప్పినా.. తమ హెచ్చరికలను ప్రజలు పాటించలేదని అందుకే ప్రాణనష్టం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.