జగన్ కోసం డైరీ మెయింటైన్ చేస్తున్న టీడీపీ నేతలు!

ప్రజలకు నమ్మకం కలిగించాలి, ప్రజల కోసం పాటుపడాలి, ప్రజల తరుపున ప్రశ్నించాలి. కానీ ఇవి తప్ప అన్నీ చేస్తున్నారు టీడీపీ నేతలు! జగన్ ను గద్దెదింపాలి.. తాము మళ్లీ అధికారంలోకి రావాలని ఫిక్సయినట్లుగా మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. ప్రజల తరుపున కాకుండా తమ తరుపున మాట్లాడుతూ దొరికిపోతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! అందుకు తాజా ఉదాహరణ… ప్రమాణస్వీకారం సందర్భంగా గుంటూరు జిల్లా నేతలు చెప్పిన మాటలు!

అవును… “జగన్ చేస్తున్న ప్రతీ పనిని డైరీ పెట్టిమరీ నోట్ చేసుకుంటున్నాం.. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. ఫ్లెక్సీలను పోలీసులతో తొలగిస్తున్నారు.. ఏ పోలీసులైతే ఫ్లెక్సీలు తొలగించారో తిరిగి అదే పోలీసులతో టీడీపీ నేతల ఫ్లెక్సీలు కట్టిస్తాం.. జగన్ కు వడ్డీతో సహా చెల్లిస్తాం..” ఇవి టీడీపీ నేతలు తాజాగా చెప్పిన మాటలు!

ఇందులో ఏఒక్కటైనా ప్రజలకు ఉపయోగపడేమాటలు ఉన్నాయా.. కనీసం టీడీపీ కార్యకర్తలకైనా కలిసొచ్చే మాటలుగా ఇవి ఉన్నాయా.. దీనివల్ల టీడీపీ నేతలపై ప్రజల్లో కలిగే విశ్వాసం ఏమిటి? జగన్ వారిపై కేసులు పెడుతున్నారు.. జగన్ పై రేపు వాళ్లు కేసులు పెడతరారంట! దానివల్ల ప్రజలకు కలిసొచ్చేదేమిటో టీడీపీ నేతలకే తెలియాలి! పనికి రాని శపథాలు బయటకు ఎందుకు చెప్పడం.. నిజంగా జగన్ పై ఏమైనా కోపం ఉంటే అది లోపల ఉంచుకోవాలి తప్ప ఇలా బెదిరింపులకు పాల్పడతారా?

బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తా జగన్… ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాటి అధికార పార్టీ మాటలు వినని వ్యక్తి… నేడు సీఎం అయ్యాక అసలు వారి మాటలను కనీసం వినే ప్రయత్నం అయినా చేస్తాడా? ఇకపై అయినా ఈ “వడ్డీల” మాటలు కట్టిపెట్టి ప్రజల కోసం పనిచేయాలని, ఫలితంగా ప్రజల మెప్పు పొందాలని కోరుకుంటున్నారు తమ్ముళ్లు!!