టీడీపీ సీనియర్ నేత, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాయలసీమ నుంచి టీడీపీ గెలుచుకున్న మూడు సీట్లలో ఒకటి తన ఖాతాలో వేసుకున్న నాయకుడు పయ్యావుల కేశవ్. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన కేశవ్.. ప్రస్తుతం ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. అయితే, ఆయన యాక్టివ్‌గా లేకపోవడం గమనార్హం. నిజానికి జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఏడాది కాలంలో అనేక పథకాలకు నిధులు వెచ్చించింది. ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో నిధులను పందేరం చేస్తోంది. అయితే, వీటిపై లెక్కలు తీసుకుని.. జగన్ సర్కారును ఏకేసే అవకాశం పయ్యావులకు ఉంది.
అయితే, కేశవ్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా జగన్ సర్కారుపై పన్నెత్తు మాట అనలేదు. అసలు ఆయన పీఏసీ భేటీలు నిర్వహిస్తున్నట్టు కూడా ఎక్కడా వార్తలు రాలేదు. ఆయన స్పందన కోసం.. టీడీపీ నేతలు సైతం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు బాబు అనుకూల మీడియాలో మాత్రం.. వైసీపీపై నిప్పులు కురుస్తున్నాయి. ఆ పథకానికి ఇన్ని కోట్లు వృథా చేశారు. ఈ పథకానికి ఇన్ని కోట్లు జేబులో వేసుకున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో పయ్యావుల కూడా తనదైన శైలిలో లెక్కలతో విరుచుకుపడితే.. ఇక, ఆయనను ఆపేది ఎవరూ ఉండకపోగా.. చంద్రబాబు కు కూడా నైతికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.
కానీ, ఎందుకో.. పయ్యావుల మౌనం పాటిస్తున్నారు. ఇక, జిల్లా రాజకీయాల్లో చూసుకున్నా.. కీలకమైన జేసీ బ్రదర్స్ ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. ఇక, ఒకప్పుడు దూకుడు రాజకీయాలు చేసిన పరిటాల ఫ్యామిలీ కూడా మౌనంపాటించింది. దీంతో ఇప్పుడు పయ్యావులకు జిల్లాలో చెలరేగే అవకాశం ఉంది. ఆయన పార్టీని నడిపించడంలో దూకుడు నిర్ణయాలు తీసుకున్నా.. ఎవరూ అడ్డు చెప్పే పరిస్థితి లేదు. పైగా తన అనుచర గణాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది. అయినా కూడా పయ్యావుల ఆదిశగా ఎక్కడా అడుగులు వేయడం లేదు. గెలిచారనే పేరు తప్ప.. ఇప్పటి వరకు నియోజకవర్గంలోనూ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టింది లేదు.
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. పార్టీ మారి.. వైసీపీ పంచన చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొన్నాళ్లుగా ఈ ప్రచారం ఊపందుకున్నా.. పయ్యావుల మాత్రం మౌనం పాటించారు. దీంతో ఆయన రాజకీయాలపై విమర్శలతోపాటు.. ఇలా చేస్తే.. ఎలా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా పయ్యావులను తన లిస్ట్‌లో ఎక్కడో చివరన పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తనకు ఏదైనా అవసరమైనా, పార్టీ తరఫున కార్యక్రమాలు, మీటింగులు నిర్వహించాలని అనుకున్నా.. ఆయన యనమల, అచ్చెన్న.. వంటివారికే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. దీనికి పయ్యావుల వైఖరే కారణమని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆయన కలివిడిగా ఉంటారా? కాదని బయటకు వెళ్తారా? అనేది తేలాల్సి ఉంది.
-vuyyuru subhash