ఈ సారి కూడా మ‌హానాడు చ‌ప్ప‌నేనా… వ్యూహం సిద్ధం

-

దేశంలో ఏ పార్టీ చేయ‌ని విధంగా రాష్ట్రంలోని టీడీపీ పార్టీ ఏటా మే నెల‌లో మ‌హానాడును ఘ‌నంగా నిర్వ‌హించే విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో పార్టీ అధికారంలో ఉండ‌డంతో ఈ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఏటా ఒక ప్రాంతంలో ఘ‌నంగా నిర్వ‌హించే మ‌హానాడు టీడీపీకి ద‌శ-దిశ చూపిస్తుంద‌నే విష‌యం తెలిసిందే. వ‌ర్త‌మానాన్ని చ‌ర్చించుకోవ‌డం తోపాటు.. గ‌తాన్ని నెమ‌రు వేసుకుంటూ.. భ‌విష్య‌త్ పునాదులు ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్ర‌మానికి పార్టీ చాలా ప్రాధాన్యం ఇస్తుంది. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిలిపి వేశారు.

అయితే, ఇప్పుడు ఈ ఏడాది మ‌హానాడును నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు ఉత్సాహంగా ఉన్నారు. దీనికి రెండు ప్ర‌ధాన కారణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి పార్టీకి పున‌రుజ్జీవం క‌ల్పించ‌డం, రెండు జ‌గ‌న్ పాల‌న ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో లోపాల‌ను టార్గెట్ చేస్తూ.. మూడు రోజుల పాటు విమ‌ర్శ‌లు సంధించే అవ‌కాశం ఉండ‌డం. దీంతో ఈ మ‌హానాడుకు ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా యువ‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇప్పుడు మ‌హా నాడు స్వ‌రూపం మారిపోయింది. తాజాగా చంద్ర‌బాబు నుంచి క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులకు అందిన స‌మాచారం మేర‌కు మ‌హానాడు ఈ ఏడాది నిర్వ‌హిస్తున్నారు.

అయితే, రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డం, తాను హైద‌రాబాద్‌లోని స్వ‌గృహంలోనే ఉండిపోవ‌డం, పైగా లాక్‌డౌన్ ను ఈ నెల 31 వ‌ర‌కు పొడిగించ‌డంతో చంద్ర‌బాబు మ‌హానాడు స్వ‌రూపాన్ని మార్చివేశార‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ద‌ఫా మ‌హానాడును హైద‌రాబాద్‌లోని త‌న ఇంటి నుంచే నిర్వ‌హించాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. నేత‌లు కూడా త‌మ త‌మ ఇళ్ల‌లోనే ఉంటూ.. ఆన్‌లైన్ ద్వారా వీడియో కాన్ప‌రెన్స్ ఏర్పాటు చేసి మ‌హానాడును నిర్వ‌హించాల‌ని బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న ఏపీకి వ‌చ్చినా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను క్వారంటైన్‌కు త‌ర‌లిస్తుంద‌నే ప్ర‌చారం ఉంది. పైగా ఇప్పుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో మ‌హానాడుకు ఎలాగూ అనుమ‌తులు ఉండ‌వు. వీటిని దృష్టిలో పెట్టుకుని బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, రెండు మూడు రోజుల్లో క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news