ఆ వైసీపీ ఎమ్మెల్యేల్లో వ‌ణుకు స్టార్ట్‌… 2024లో ఆశ‌లు నిల్‌..!

ఏపీలో రాజకీయం రోజురోజుకు మాంచి రసవత్తరంగా మారుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను టార్గెట్‌గా చేసుకుని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. జగన్ సీఎం అయ్యి ఏడాదిన్నర కావొస్తున్న నేపథ్యంలో మెజార్టీ ప్రజల్లో ఇప్పటికీ ఎమ్మెల్యేల కంటే జగన్ పట్ల ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. పార్టీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో 70 – 80 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి జిల్లా గుంటూరులో వైసీపీ కి తీవ్రమైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

రాజధాని వికేంద్రీకరణ తర్వాత గుంటూరు జిల్లాల్లో వైసిపితో పాటు… వైసిపి ప్రజాప్రతినిధులు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అధికార పార్టీ ఎంత వికేంద్రీకరణ అని చెప్పుకున్నా… జిల్లా ప్రజలు మాత్రం రాజధాని మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎంతో అభిమానంతో ఓట్లేసిన ప్రజలు సైతం రాజధాని మార్పుపై తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రభావం వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజధాని వికేంద్రీకరణ అని పైకి ఎంత సర్ది చెప్పుకున్నా… జిల్లాలో సొంత క్యాడర్ నుంచి సైతం ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజ‌ధాని మార్పుతో అక్క‌డ ఆస్తులు విలువ ఘోరంగా ప‌డిపోయింది. వ్యాపారాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. రాజ‌ధాని అక్క‌డ ఉన్న‌ప్పుడు జ‌ర్జాగా బ‌తికిన సామ‌న్యుల జీవితాలు ఇప్పుడు కుదేల‌య్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వ‌స్తే గుంటూరు జిల్లాలో మాత్రం అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

ఇక వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన పలువురు జూనియర్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది అంతర్గత సంభాషణల్లో రాజధాని మార్పు ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందని… ఈ పరిస్థితుల్లో మ‌నం రాజ‌కీయంగా నిల‌దొక్కుకోవ‌డం ఎలా ? అన్న సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారట. ఓవైపు ప్రజల నుంచి వ్యతిరేకత మరోవైపు కేడ‌ర్లో నెలకొన్న నైరాశ్యం.. ఇటు రాజధాని మార్పు ప్రభావంతో గుంటూరు జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. అందుకే ఈ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు త‌మ ఫ్యూచ‌ర్‌పై ఆందోళ‌న‌లోనే ఉన్నారంటున్నారు. మరి జగన్ దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి.

-Vuyyuru Subhash