గుంటూరు నగరంలో అనారోగ్య కేసుల నమోదుకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని తాజాగా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమస్యకు కారణాలు, పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. బాధితులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
అనారోగ్య సమస్యకు కారణాలపై అన్వేషణ కొనసాగుతోందని, పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చేవరకు ఎవరూ విశ్రాంతి లేకుండా పనిచేస్తారని తెలిపారు. అనంతరం నేరుగా ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. సదుపాయాలు, సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు గారు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ గారు, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్లు గారు, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి గారు, డీఎంఈ నర్సింహం గారు, డీహెచ్‌పద్మావతి గారు, ఆర్డీ శోభారాణి గారు, డీఎంఅండ్‌హెచ్‌వో విజయలక్ష్మి గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ గారు, ప్రిన్సిపాల్ టీ టీకే రెడ్డి గారు తదితరులు ఉన్నారు.