పార్వతిపురం జిల్లా కలెక్టర్‌కు షాక్ ఇచ్చిన పేద రైతు..!

-

ఏపీలోని పార్వతిపురం మన్యం జిల్లాలో ప్రధానంగా కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో ఏనుగుల సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే గుండెల్లో వణుకు మొదలవుతుంది. రైతులు పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఏనుగుల గుంపు మరోసారి కొమరాడ మండలం గారవలస సమీపంలో రెచ్చిపోయాయి. గారవలస గ్రామానికి చెందిన వెంకట నాయుడు అనే రైతు తన పంట పొలాల్లో కూరగాయలు పండిస్తుంటాడు. అలా పండించిన కూరగాయలను సమీపంలోని పార్వతీపురం పట్టణానికి సైకిల్ పై తీసుకెళ్లి అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. బస్సుల్లో కానీ, ఆటోలో కానీ కూరగాయలు తీసుకెళ్తే తనకు వచ్చే ఆదాయం ఆ చార్జీలకే సరిపోతుందనే ఉద్దేశంతో ప్రతిరోజు సైకిల్ పైనే కూరగాయలు అమ్ముతుంటాడు.

ఎప్పటిలాగే ఉదయాన్నే తన స్వగ్రామం నుండి కూరగాయలు సైకిల్ పై తీసుకొని పార్వతీపురం పట్టణానికి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఏనుగుల గుంపు సడన్ గా పంట పొలాల్లో నుండి రోడ్డుపైకి వచ్చింది. అప్పుడే అటుగా వస్తున్న వెంకటనాయుడును చూసిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పరిస్థితి గమనించిన వెంకట నాయుడు సైకిల్‌ను రోడ్డు పైనే వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఏనుగులు అక్కడే ఉన్న సైకిల్ ను ధ్వంసం చేశాయి.

తనకు జరిగిన అన్యాయానికి పట్టరాని కోపంతో తన ధ్వంసమైన సైకిల్‌ను భుజాన వేసుకొని సుమారు 15 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చాడు. ఘటనా స్థలం నుండి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ కలెక్టర్ ని కలిసి తన సైకిల్ చూపించి మీ వల్ల నాకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు వెంకటనాయుడు హావభావాలు చూసిన కలెక్టర్ నిషాంత్ కుమార్ ఖంగుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news