తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కింది స్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే రెండు, మూడు రోజుల్లో అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఇప్పటికే రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంట నష్టం జరిగిందని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.