దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వంశీ జైలుకు వెళ్లాడని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలో తెలుస్తాయన్నారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలపై శిక్షిస్తామన్నారు. వైసీపీ పాలనలో కొనసాగిన అరాచకాలను అంతా చూశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పై పోరాడిన తమపై కేసులు పెట్టారని అన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని తెలిపారు.
గత ఐదేళ్లలో చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలు అవుతుందని తెలిపారు. 2019-24 మధ్య సాగిన అరాచక పాలన గురించి ప్రజలందరికీ తెలుసు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. అడుగడుగునా ఇబ్బందులు పెట్టి.. చంద్రబాబు బయటకు రాకుండా ఇంగి గేట్ కు కూడా తాళ్లు కట్టారని గుర్తు చేశారు. ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే.. అక్రమ కేసులు పెట్టడం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని పేర్కొన్నారు.