ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కడపలో రెండు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం పై చర్చించారు. పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను ఇప్పటికే మాజీ సీఎం జగన్ పార్టీ కార్యకర్తలో చర్చించారని తెలిపారు. ఎన్నికల తరువాత ఇప్పుడు పార్టీ బలోపేతం పై దృష్టి సారించామని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టులలో నియామకాలు చేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి దారుణంగా ఉందని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.