ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో జెయింట్ కిల్లర్లు.. ఎన్నికల్లో పెద్ద నేతలను ఓడించి ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీలోనే సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అయ్యారు. అటు జగన్ సైతం వీరికి మంచి పదవులు ఇస్తారని అందరూ భావించారు. అందులో ఒక నేతకు ఏకంగా మంత్రి పదవి ఇస్తానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతోంది. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఊసే లేదు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో కాదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మరోకరు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.
వీరిలో ఆళ్ల చంద్రబాబు తనయుడు… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఓడించి సంచలనం క్రియేట్ చేశారు. ఇక నాగిరెడ్డి, గ్రంథి శ్రీను ఇద్దరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించారు. విచిత్రం ఏంటంటే పార్టీలకే పెద్ద తలకాయలుగా ఉన్న లోకేష్, పవన్ కళ్యాణ్‌లను అసెంబ్లీ గడప తొక్కనీయకుండా ఓడించడం అంటే మామూలు విషయం కాదు. వీరిలో మంగళగిరి ఎన్నికల ప్రచారంలో ఆళ్ల లోకేష్‌ను ఓడిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.
ఇక ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇటీవలే ఆయన అన్న అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ ఇవ్వడంతో పాటు కుల సమీకరణల్లో ఆయనకు మంత్రి పదవి వచ్చే ఛాన్సే లేదంటున్నారు. వైసీపీలో ఏకంగా 30 మంది రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశావాహులుగా ఉన్నారు. ఇక భీమవరంలో పవన్‌ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్‌ను పట్టించుకోవడం లేదట. ఆయనకు జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెపుతోన్న పరిస్థితి.
ఇక విశాఖలోని గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి పేరు ఎప్పుడూ ఎక్కడా వినపడడం లేదు. విశాఖ జిల్లా నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేల పేర్లు మీడియాలో వినిపిస్తున్నా.. నాగిరెడ్డిని పట్టించుకున్న వాల్లే లేరు. సో అలా పవన్, లోకేష్‌ను ఓడించిన నేతల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది.