సాధారణంగా తిరుమలలో భక్తుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ప్రస్తుతం కార్తిక మాసం కావడంతో శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వీకెండ్ కావడంతో భక్తులతో తిరుమల కిక్కిరిసిపోయింది. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 నుంచి 6 గంటల వరకు సమయం పడుతోంది.
అలాగే ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. శిలతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. నిన్న శనివారం ఒక్కరోజు స్వామి వారిని 88,076 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వారి హుండీ ఆదాయం 3.52 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. కార్తీక మాసంలో తిరుమలకు వచ్చే భక్తుల వారి తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్రీశైలంలో కూడా ఇవాళ భక్తులు కిక్కిరిసిపోయారు.