వేసవి సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు గురువారం రోజున స్వామి వారిని 55,537 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 20,486 మంది వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు వేసవి వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. చల్లని వాతావరణంలో భక్తులు కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా వసతులు కల్పించినట్లు చెప్పారు.