ఎడారి దేశమైన దుబాయ్ వరదలతో విలయంగా మారింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. భారీ వరదల నేపథ్యంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ సూచనలు పాటించాలని పేర్కొంది.
దుబాయ్‌తోపాటు సమీప ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తడంతో ఊహించని వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇండియన్ ఎంబసీ తెలిపింది. దీనివల్ల దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వెల్లడించింది. ముఖ్యంగా ఇన్‌బౌండ్ విమానాల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు చెప్పింది. విమానాలు బయలుదేరే తేదీ, సమయానికి సంబంధించి సదరు విమానయాన సంస్థ నుంచి ధ్రువీకరణ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపింది.