కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగబోతోంది. దసరా రోజున అర్ధరాత్రి జరిగే కర్రల సమరాన్ని బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. హోల గుంద మండలం దేవరగట్టులో ఈ కర్రల సమరం జరగనుంది. శ్రీ మాళ మల్లేశ్వర స్వామి కల్యాణం తర్వాత.. ప్రతీ ఏడాది దసరా పండుగ రోజు కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే.. ఇవాళ రాత్రి కర్రల సమరం జరగనుంది.
పోలీసు ఉన్నతాధికారులు పకడ్బందీ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యం రవాణాను నిర్మూలించేందుకు కర్నాటక బళ్ళారి జిల్లా నుంచి ఆలూరు వైపు వెళ్లే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. ఈ కర్రల సమరానికి సుమారు 800 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు.. ముందస్తు చర్యల్లో భాగంగా.. ఇప్పటికే వందలాది మందిని బైండోవర్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.