వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని నిషేధం విధించారు.
కొండచెరియలు విరిగిపడడం వల్ల విజయవాడలో ఐదుగురు మరణించారు. తెలంగాణలో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.
తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి భారీగా విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐదు లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. అంతేకాకుండా తన కుమారుడు, కుమార్తె తరపున కూడా విరాలం ప్రకటించారు. కుమారుడి తరపున 2.5 చొప్పున రెండు రాష్ట్రాలకు సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.