విశాఖలో అధికార వైఎస్సార్టీపీ ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఇంఛార్జ్ విజయసాయి రెడ్డి మధ్య విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్‌ఛార్జుల వ్యవహారంతో రాజుకున్న వేడి రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి నిర్ణయించిన వారితో నియామక ప్రకటన విడుదలైన ఒక్క రోజులోనే పేర్లు మార్చేలా విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ వ్యవహారం జరిగిన గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి ముఖ్య అనుచరులైన వైఎస్సార్సీపీ నగర 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్, 89వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆడారి ఆనంద్‌కుమార్‌కు సహకరించకపోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనికి వెనుక వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. పీవీ సురేష్, దొడ్డి కిరణ్‌లు విజయసాయిరెడ్డికి కొన్నేళ్లుగా ప్రధాన అనుచరులుగా ఉన్నారు.