చంద్రబాబుకు దమ్ముంటే, చంద్రగిరి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు విజయ సాయిరెడ్డి. ‘కుప్పం నా సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఏడుసార్లు గెలిచా,’ అంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులపై నిన్న రుబాబు చేయాలని చూడడం ఆంధ్రా ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ‘రాష్ట్ర, పంచాయతీ రోడ్లపై రోడ్ షోలు పెట్టవద్దు, పల్లెల్లో ఆ పనిచేయవచ్చు,’ అని కుప్పంలో పోలీసులు సలహా ఇచ్చినప్పుడు టీడీపీ అగ్రనేత వారిపై మండిపడ్డారన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా చట్టసభల్లో దిగువసభ సభ్యుడైనప్పుడు ఏదో ఒక సీటు నుంచి గెలవక తప్పదు. అంత మాత్రాన ‘ఇది నా సొంత స్థానం. నేను ఇన్ని సార్లు ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యా,అంతా నా ఇష్టం,’ అని అనడం ఎంతటి బడా నాయకుడికైనా సబబు అనిపించుకోదు. ముఖ్యంగా ఇలా మాట్లాడే నేత 14 ఏళ్లు సీఎంగా, 13 ఏళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు అయినప్పుడు ప్రజలు హర్షించరు. ఏ నియోజకవర్గం నుంచి ఏ నాయకుడు గెలిచినా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ ఆయన పర్యటించవచ్చు. ప్రజలనుద్దేశించి ప్రసంగించవచ్చని తెలిపారు.
‘జాతీయ రాజధాని న్యూఢిల్లీలో చక్రం తిప్పానని’ చెప్పుకునే సీనియర్ నేతకు చెప్పాల్సిరావడం నిజంగా సిగ్గుచేటు. చంద్రబాబు గారు తన తొలి ఎన్నికల ప్రయత్నంలో 1978లో గెలిచిన చంద్రగిరిలో 1983లో ఓడిపోయారు. మళ్లీ ఇక్కడ నుంచి ఏపీ శాసనసభకు పోటీ చేయకపోవడం ఆయన నిర్ణయం. సరే, ఆ స్వేచ్ఛ ఆయనకు ఉంది. కాని, మాజీ సీఎంకు అన్ని నియోజకవర్గాలూ సమానమైనప్పుడు–చంద్రగిరి కన్నా కుప్పంపై ఎక్కువ అధికారం, హక్కులు ఉంటాయా? అంటే– ఉండవనే చట్టం తెలిసినవారు జవాబిస్తారని మండిపడ్డారు విజయ సాయిరెడ్డి.