ఎంతో ప్రశాంతంగా ఉండే సాగర తీరం విశాఖలో ఇప్పుడు గ్యాస్ లీక్ అవ్వడం సంచలనంగా మారింది. వందలాది మంది గ్యాస్ లీక్ బాధితులు విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ఘటన కాకపోయినా 1997 సెప్టెంబర్ లో విశాఖలో హిందుస్తాన్ పెట్రోలియం లో పేలుడు సంభవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు భారత ఓడరేవు అయిన విశాఖ పట్నంలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్),
చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి కనీసం 25 మంది మరణించినట్లు సమాచారం. విశాఖ్ రిఫైనరీలోని స్టోరేజ్ ట్యాంకుకు ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) తీసుకెళ్తున్న పైప్‌లైన్‌లో లీక్ కావడం పేలుడుకు కారణమైందని, మరో ఆరు స్టోరేజ్ ట్యాంకులకు ఈ మంట అంటుకుంది. దీనితో భారీ పేలుడు సంభవించి పలువురు గాయపడ్డారు కూడా.
ఆ రోజు ఆదివారం… ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన స్టోరేజ్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయని, రిఫైనరీ వద్ద పరిస్థితి అదుపులో ఉందని హెచ్‌పిసిఎల్ అధికారి తెలిపారు. రిఫైనరీ సమీపంలో 60, 000 మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. దీనిలో ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోయినా ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా వేడి వాతావరణం వచ్చింది అని, ఆ వేడి ఒక రోజు అలాగే ఉండిపోయింది అని, దాదాపు 70 డిగ్రీల ఉష్ణోగ్రత అప్పుడు గాలిలో ఉందని జాతీయ మీడియా పేర్కొంది.
ఇదిలా ఉంటే తాజా గ్యాస్ దుర్ఘటనను భోపాల్ గ్యాస్ దుర్ఘటనతో పోలుస్తున్నారు. 1984లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కూడా అర్ధరాత్రి సమయంలోనే జరిగింది. యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన టన్నుల కొద్ది విష వాయువు విడుదలైన 24 గంటల్లోనే మూడు వేల మంది వరకు మరణించారు.